ఖమ్మం/ ఖమ్మం రూరల్/ తల్లాడ, వెలుగు : ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్‌రోడ్డు వద్ద తరుణీ హట్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవనాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవన సముదాయం అందుబాటులోకి వస్తే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని, తద్వారా ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగుతుందని మంత్రి అన్నారు. అనంతరం పాలేరు నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తల్లాడలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేశ్‌నవరాత్రి ఉత్సవాల్లోనూ మంత్రి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్‌తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షుడు తోట వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
